యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. విడుదలకు ముందే సినిమా డిజిటల్ ప్రింట్ లీకైనా ఆ సినిమాతో కూడా హిట్టు కొట్టి చూపించిన దమ్మున్నోడు మనోడు. అలాంటి విజయ్ దేవరకొండ ఏమైనా చేయగలడు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు విజయ్ చేతిలో ఉన్నాయి. అందులో మొదటగా 'డియర్ కామ్రేడ్' మూవీ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్వచ్ఛమైన గోదావరి జిల్లా కుర్రోడిగా కనిపించబోతున్నాడు. గోదావరి జిల్లాల యాసలో డైలాగులు పలకనున్నాడీ తెలంగాణా పోరడు. ఇదిలా ఉంటే, 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని విశేషంగా దోచేసిన దర్శకుడు క్రాంతి మాధవ్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు హీరోయిన్లు విజయ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి రెడీ అయ్యారు. వారే రాశీఖన్నా, ఇసాబెల్లా, కేథరీన్, ఐశ్వర్యా రాజేష్.
కాగా ఈ సినిమా విషయమై తాజా అప్‌డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో 8 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా నటించబోతున్నాడట. కొన్ని నిముషాలు మాత్రమే ఈ క్యారెక్టర్ సినిమాలో ఉంటుందనీ తెలుస్తోంది. అయితే యూత్‌లో మస్త్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ సాహసం చేస్తాడా.? ఏమో ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ, ఎక్కువ భాగం మాత్రం ప్లేబోయ్‌లా కనిపించనున్నాడు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.