'అరవింద సమేత' సందడి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు బయటకొస్తాడు? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా ఏంటనే ఉత్కంఠ అయితే పెద్దగా ఎవరికీ లేదు. ఎందుకంటే, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందబోతోంది. నిజానికి ఇది మల్టీస్టారర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతోన్న హై ఓల్టేజ్ మల్టీస్టారర్ ఇది.
తెలుగు సినీ పరిశ్రమలోనే దీన్ని అతి పెద్ద మల్టీస్టారర్‌గా భావిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాల నిర్మాణం అంత తేలిగ్గా అయిపోదు. దానికో పెద్ద కథ వుంటుంది. 'బాహుబలి' సిరీస్‌ని రాజమౌళి ఎన్నేళ్ళు తీశాడో చూశాం. అంత టైమ్ పట్టకపోవచ్చుగానీ, శరవేగంగా అయితే సినిమా పూర్తయిపోదు కదా.! మరి, ఈలోగా యంగ్ టైగర్ ఇంకో సినిమా ఏదన్నా చేసే ఛాన్స్ వుందా.? అన్నదే అభిమానుల డౌట్. ఎందుకు లేదూ! 'అరవింద సమేత' తర్వాత ఓ సరదా సరదా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచన ముందే చేశాడట యంగ్ టైగర్.
అన్నీ కుదిరితే ఆ సినిమాని సెట్స్ మీదకు ఎన్టీఆర్ తీసుకెళ్ళే అవకాశం వుంది. కానీ, అందుకు రాజమౌళి అనుమతి కావాల్సి వుంటుంది. ఎందుకంటే, ఒక్కసారి రాజమౌళి సినిమాలో గెటప్ ఫిక్స్ అయితే, ఆ తర్వాత ఆ హీరో, ఇంకో సినిమా చేయడం ఇబ్బందే. ప్రభాస్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మాత్రమే కాదు, చరణ్దీ ఇదే పరిస్థితి.