దర్శకుడు సుశి గణేషన్‌పై హీరోయిన్ అమలాపాల్ 'మీ టూ' బాంబు పేల్చింది. దర్శకురాలు లీనా మనిమేకలై, తొలుత సుశి గణేషణ్‌పై ఆరోపణలు చేయగా, ఆమెకు మద్దతుగా నిలిచిన అమలాపాల్ సుశి గణేషన్‌తోపాటు ఆయన భార్య కూడా మహిళల్ని గౌరవించడం చేతకాని వ్యక్తి.. అంటూ పెద్ద బాంబు పేల్చింది. తనకు ఫోన్ చేసి బూతులు తిట్టారని ఆరోపించింది.
వాస్తవానికి 'మీ..టూ..' ఉద్యమం ఇంత ఉధృతం కాక మునుపే అమలాపాల్, లైంగిక వేధింపులపై గళం విన్పించింది. ఓ ఈవెంట్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, తనపై ఓ వ్యక్తి చెయ్యి వేశాడనీ, తనతో అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తే, అతన్ని నిలువరించానని పేర్కొంది అమలాపాల్. అమలాపాల్ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. మరోపక్క సుశీ గణేశన్‌కి వ్యతిరేకంగా మహిళా లోకం గళం విప్పుతోంది. ఒకరొకరుగా బాధితులు సోషల్ మీడియాకెక్కుతున్నారు.
ప్రముఖ దర్శకుడిగా సుశీ గణేశన్ అనతికాలంలోనే పేరు దక్కించుకున్నా, ఆయనపై 'వేధింపుల' ఆరోపణలు తక్కువేమీ కాదు. అయితే, ఈ విషయంలో తన మీద కుట్ర జరుగుతోందంటూ సుశీ గణేషన్ తరఫు నుంచి వాదన విన్పిస్తోంది. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా కారణంగా హైలైట్ అయిన 'మీ టూ' వివాదం, ఇప్పుడు దక్షిణాది సినిమాని ఓ కుదుపు కుదిపేస్తోంది.
ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం పరిస్థితి గుంభనంగా కన్పిస్తోంది. ఎప్పుడు ఎవరు ఎలాంటి బాంబు తెలుగు సినీ పరిశ్రమలో పేల్చుతారో తెలియని పరిస్థితి వుందిక్కడ.