ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు? ఈ విషయంపై నందమూరి, టీడీపీ అభిమానులు ఎప్పటి నుంచో... తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి తరవాత... ఈ చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఇప్పుడొచ్చిందని, ఎన్టీఆర్ ఈ విషయంలో త్వరగా స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీడీపీకి... కొత్తరక్తం అందించాలంటే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే.. ఎన్టీఆర్ పార్టీ జెండా మోయడం తప్పనిసరి. గతంలో కూడా.. `పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సేవ చేస్తా` అంటూ... ఎన్టీఆర్ మాటిచ్చాడు కూడా. ఇటీవల ఎన్టీఆర్‌ని రాజకీయ రంగ ప్రవేశం గురించి అడిగినప్పుడు సమాధానం దాటేశాడు. ఇప్పుడు సమయం కాదంటూ... తప్పించుకున్నాడు. నిజానికి ఇదే సరైన సమయం. టీడీపీ ఇప్పుడు దీనావస్థలో ఉంది. ఎన్టీఆర్ లాంటి యువకులు ఈ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకోవాలి.
ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడం భావ్యం కాదు. అయితే ఎన్టీఆర్ మనసులో చాలా ఆలోచనలు రేగుతున్నట్టే కనిపిస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి పెద్దలు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి, కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే - అప్పుడు టీడీపీ జెండే మోద్దాం.. అని ఎన్టీఆర్ చూస్తున్నాడట. 2024 ఎన్నికలకు ముందు... ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎన్టీఆర్ రాకపోతే.. ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని, సమయం చూసుకుని ఎన్టీఆరే.. స్వయంగా ఓ కీలకమైన ప్రకటన చేస్తాడని చెప్పుకుంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?