స్టార్ హీరోల సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ భారీ ఆసక్తి ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది? సినిమా టైటిల్ ఏంటి? స్టోరీ లైన్ ఏంటి? హీరోయిన్ ఎవరు? ఇలా అన్ని అంశాలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అధికారికంగా ప్రకటించే వరకూ అవి తెలిసే అవకాశం ఉండదు కాబట్టే ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో గాసిప్పులు షికారు చేస్తుంటాయి. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #ఎన్టీఆర్30 ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తర్వాత 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటు ప్రశాంత్ నీల్ ఇటు మైత్రీ మూవీ మేకర్స్ వారి నుంచి హింట్స్ వచ్చాయి కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఉంటుందని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు 'మిస్సైల్ & న్యూక్లియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారంటూ ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇది ఒకటే టైటిలా లేక 'న్యూక్లియర్' వేరే, 'మిస్సైల్' వేరేనా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా టైటిల్స్ మాత్రం ఎన్టీఆర్ మాస్ ఇమేజికి తగ్గట్టు పవర్ఫుల్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.