ఆర్.ఆర్.ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత ఎన్టీఆర్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. దీనికి కారణం... కొరటాల శివ. ఎన్టీఆర్ తో కొరటాల శివ ఓ సినిమా చేయాలి. అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. అయితే.. ఆ తరవాత ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎన్టీఆర్‌కి కొరటాల ఇది వరకు ఓ లైన్ చెప్పాడు. అది ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది. అయితే దాన్ని స్క్రిప్టుగా డవలెప్ చేసే విషయంలో కొరటాల తడబడ్డాడు. పైగా ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించాలంటే సాదా సీదా కథలు నడవవు. అందుకే స్క్రిప్టుపై మరింతగా దృష్టి పెట్టమని కొరటాలకు సలహా ఇచ్చాడు ఎన్టీఆర్. కథలో కొరటాల పలు మార్పులు చేసినా.. ఎన్టీఆర్ కి నచ్చలేదు. దాంతో `దసరా లోపు.. పూర్తి కథ చెప్పు` అంటూ డెడ్ లైన్ విధించినట్టు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ ఒత్తిడి తీసుకుని రావడంతో... కొరటాల ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని, ఆ స్థానంలో బుచ్చిబాబు కథని ఓకే చేస్తాడని ప్రచారం జరిగింది.
అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పినట్టే గడువు లోపే.. కొరటాల పూర్తి కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది. దసరా రోజున ఎన్టీఆర్ - కొరటాల మధ్య కీలకమైన భేటీ జరిగిందని, మార్పులూ, చేర్పులతో కొరటాల పూర్తి కథ చెప్పేశాడని తెలుస్తోంది. దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ కీలకమైన అప్ డేట్ రాబోతోందని సమాచారం. మొత్తానికి కొరటాల మొదటి టాస్క్ లో విజయం సాధించాడు. ఇక ఈ సినిమా పట్టాలెక్కడమే తరువాయి.