నిత్యా శెట్టి.. ఈ పేరు విన్నారా.? విని ఉండరులే. హీరోయిన్‌గా ఇప్పుడే ఈ పేరు మార్మోగిపోతోంది కానీ, ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఛైల్డ్ ఆర్టిస్టుగా రెండు నంది అవార్డులు అందుకున్న ఈ చిన్ని పాప ఇప్పుడు పెద్ద పాపగా మారి, ‘ఓ పిట్టకథ’ సినిమాతో ప్రేక్షకుల్ని పకరించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘దేవుళ్లు’ సినిమాతో తమ్ముడూ.. తమ్ముడూ.. అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడిన ఈ పాప తెలుగులో ‘దాగుడు మూతలు దండాకోర్’ అనే సినిమాకి నంది అవార్డు అందుకుంది. రాజేంద్రప్రసాద్‌తో కలిసి మధు అను చిన్న పిల్ల పాత్ర పోషించింది ఈ సినిమాలో నిత్యాశెట్టి. అంతకు ముందే ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ఓ నందిని కైవసం చేసుకుంది.
ఇక ఇప్పుడు ‘ఓ పిట్టకథ’ సినిమాలో ‘వెంకటక్ష్మి’ పాత్రతో హీరోయిన్‌గా మన ముందుకు వస్తోంది. చిన్నప్పుడే నటనలో నంది అవార్డులు అందుకున్న ఈ చిచ్చరపిడుగు పెద్దయ్యాకా తన టాలెంట్ ఇంకే రేంజ్‌లో చూపించనుందో చూడాలంటే, ‘ఓ పిట్టకథ’ సినిమా చూడాల్సిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరోయిన్‌గా నిత్యాశెట్టికీ, హీరోగా సంజయ్‌కీ మంచి విజయం అందించాలని ఆశిద్దాం.