కరోనా వైరస్ ఇంపాక్ట్ అప్పుడప్పుడే మన ఇండియాని తాకుతున్న టైమ్‌లో రిలీజైన సినిమా ‘ఓ పిట్టకథ’. చిన్న సినిమా. కానీ, పెద్ద సినిమా స్థాయిలో ప్రమోషన్స్ చేశారీ సినిమాకి. దాంతో చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచే అవకాశముందని అంతా భావించారు. కానీ సీను రివర్స్ అయ్యింది. చైనాలో పుట్టి ఖండాలు దాటుకుంటూ, మన భరత ఖండాన్నీ అతలాకుతలం చేయడానికి వచ్చిన కరోనా వైరస్ ఈ సినిమా సక్సెస్‌ని అడ్డుకుంది. భారత్‌లో కరోనా కట్టడికి అడ్డుకట్ట వేసే నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సడెన్‌గా లాక్‌డౌన్ ప్రకటించడంతో, సినిమా ధియేటర్స్ బంధ్ అయిపోయాయి. దాంతో మొదటి వారం కూడా గడవకముందే, ‘ఓ పిట్టకథ’ సినిమా కంచెకి చేరిపోయింది. అయినా, ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేశారనుకోండి.
ఇక అసలు సంగతేంటంటే, తాజాగా ‘ఓ పిట్టకథ’ బుల్లితెరపై ప్రసారం కాబోతోంది. లాక్‌డౌన్ వేళ అంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో, ‘ఓ పిట్టకథ’ సినిమాని చాలా ఎక్కువ మంది బుల్లితెరపై వీక్షించే అవకాశాలున్నట్లు బుల్లితెర నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ఊహించని విధంగా టీఆర్‌పీ రేట్లు సంపాదించొచ్చని ఆశపడుతున్నారు. వారి ఆశలు హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అవ్వడం ఖాయమే. ఎందుకంటే, లాక్‌డౌన్ వేళ ఫ్యామిలీతో కూర్చొని, ఉన్నంతలో నచ్చిన స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని, జనమంతా టీవీల ముందు అతుక్కుపోతున్నారనడం వాస్తవమే. కాస్త క్రేజ్ ఉన్న మూవీస్‌ని ప్రసారం చేస్తే ఆ ఫాలోయింగ్ మరింత ఎక్కువే ఉంటోంది. ‘ఓ పిట్టకథ’ ఇప్పుడా ఫాలోయింగ్‌నే క్యాష్ చేసుకోబోతోంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి థ్రిల్లర్ ఎలెమెంట్స్ జోడించి ఆసక్తికరంగా ఈ సినిమాని రూపొందించారు.