సినిమా సినిమాకీ మరో పది మెట్లు పైకి ఎదుగుతున్నాడు కొరటాల శివ. అన్నీ హిట్లే. ఒకదాన్ని మించిన విజయం మరోటి. అందుకే రాజమౌళి తరవాత, సక్సెస్ రికార్డు తన పేరు మీదే ఉంది. ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య` రూపొందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టాడు కొరటాల. తన సినిమా కథలన్నీ సామాజిక నేపథ్యంలో సాగేవే. ఈసారీ అదే స్టైల్‌లో కథ రాసుకున్నాడట.
అయితే చిరంజీవి ఇమేజ్‌కి, అతని నుంచి ఆశించే మాస్ అంశాలకూ తగినట్టుగానే కథ డిజైన్ చేశాడట. చిరంజీవిని ఓ శక్తిమంతమైన పాత్రలో చూడబోతున్నామని అభిమానుల్ని ఊరిస్తున్నాడు కొరటాల. ``నా స్టైల్ ఉంటూనే చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ గా ఆయన పాత్ర ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్నయితే ఇస్తా`` అంటున్నాడు కొరటాల. సైరాలో నటిస్తున్నప్పుడే ఈ కథ చెప్పానని, అయితే చిత్రీకరణ ఆలస్యంగా మొదలైందని, కరోనా ప్రభావం తగ్గాక మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు కొరటాల శివ.