ప్రతీ యేడాది తెలుగు సినిమాల సీజన్ సంక్రాంతితోనే మొదలవుతుంది. ముగ్గుల పండగ వస్తోందంటే - థియేటర్ల దగ్గర సందడి మొదలైపోతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు క్యూ కడుతుంటాయి. ప్రతీ సీజన్‌లోనూ సంక్రాంతికి భారీ సినిమాలు వస్తుంటాయి. 2020 సంక్రాంతి కోసం ముందుగానే కర్చీఫ్‌లు రెడీ చేసేసుకున్నారు దర్శక నిర్మాతలు. వచ్చే యేడాది సంక్రాంతి సందడి మరింత జోరుగా సాగబోతోంది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, నాగార్జున, అల్లు అర్జున్, మహేష్‌బాబు, ప్రభాస్‌ల సినిమాలు సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నాయి. వీటిలో ఏవేవి సంక్రాంతి పండక్కి వస్తాయో తెలీదు గానీ, ప్రస్తుతానికి పోటీ మాత్రం వీళ్ల మధ్యే ఉంది.
మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2020 సంక్రాంతి లక్ష్యాన్ని చేసుకుని తయారవుతోంది. చిత్రబృందం ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించేసింది. సో.. మహేష్ ఈ సంక్రాంతికి సందడి చేయడం ఖాయం. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ జోరుగా ఉంది. పండగనాడు విడుదలైన బాలయ్య సినిమాలు బాగా ఆడాయి. ప్రతీ పండక్కీ తన సినిమాని విడుదల చేయడం సెంటిమెంట్‌గా మారింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రూలర్`ని పండక్కి విడుదల చేస్తారని సమచారం. అయితే కె.ఎస్ రవికుమార్ మహా స్పీడు. మూడు నెలలలో సినిమా పూర్తి చేయగలడు.
అన్నీ కుదిరితే సెప్టెంబరు - అక్టోబరులోనే ఈసినిమా వచ్చేయొచ్చు. మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా - ఇక సంక్రాంతికే విడుదల. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమానీ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరిదీ విజయవంతమైన జోడీ. పైగా త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి. సో... సంక్రాంతి పండక్కి వస్తేనే కరెక్ట్ అన్నది త్రివిక్రమ్ ఉద్దేశం. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా సంక్రాంతికే రాబోతున్నాడు. తన కొత్త సినిమా `ప్రతిరోజూ పండగే`ని విడుదల చేయడానికి పండగే సరైన సందర్భం కూడానూ. ప్రభాస్ 'జాన్' కూడా సంక్రాంతికే వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే మాత్రం 2020 వేసవిలో ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది. నాగార్జున `బంగార్రాజు`నీ సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు. `మన్మథుడు 2` విడుదలైన వెంటనే బంగార్రాజు పట్టాలెక్కుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సినిమాని పండక్కి విడుదల చేయాలని నాగ్ భావిస్తున్నాడు. సో.. ఈ పండక్కి జోరుగా సినిమాలు రాబోతున్నాయి. బాక్సాఫీసుని కళకళలాడించబోతున్నాయి. అయితే వీటిలో తుది రేసులో ఉండే సినిమాలేవన్నది డిసెంబరులో ఖాయమైపోతుంది.