అదేంటో గానీ గుంటూరు కారం ముందు నుంచీ అసంతృప్తుల మధ్య నడుస్తూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. మధ్యలో కథలు మారాయి. తీసిన సీన్లు, ఫైట్లూ పక్కన పెట్టాల్సివచ్చింది. హీరోయిన్ మారింది. కెమెరామెన్ మారాడు. పాటలొచ్చినా పెద్దగా కిక్ ఇవ్వలేదు. 'ఓ మై బేబీ' పాటనైతే విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రికీ, నిర్మాత నాగ వంశీకి అభిమానులపై కోపాలొచ్చేశాయ్. తమన్‌ని అయితే ఓ రేంజ్లో ఆడుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ పాట.. సినిమాలో లేదట. ఆ పాట స్థానంలో మరో పాటని యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
''అభిమానులకు పాట నచ్చకపోతే సినిమాలో ఉండి లాభం ఏమిటి'' అన్నది మహేష్ బాబు పాయింట్. అందుకే ఈ పాటని తొలగించారని తెలుస్తోంది. ఇదే స్థానంలో తమన్ మరో పాటని కంపోజ్ చేశాడని, ఆ పాటని నేరుగా థియేటర్లలోనే చూడాలని సమాచారం.
ఇదే సినిమా నుంచి 'కుర్చీని మడతపెట్టి' అనే మరో పాట రాబోతోంది. ప్రోమో కూడా విడుదలైంది. పాట సెటప్ చూస్తుంటే కచ్చితంగా మాస్ ప్రేక్షకులకు పండగలాంటి పాట అని అర్థం అవుతోంది. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన 'కుర్చీని మడతపెట్టి' అనే పదాన్ని త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఇదెక్కడి భావ దారిద్య్రం' అంటూ... ఈ పాటపైనా విమర్శలు మొదలైపోయాయి.