50 కోట్లు దాటేస్తుందా? అంతకు మించి వసూలు చేస్తుందా? అని నాగార్జున హీరోగా నటించిన 'ఓం నమో వెంకటేశాయ' సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమలో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని వెంటనే ఆకర్షించడం చాలా అరుదు. 'అన్నమయ్య' సినిమా విడుదలైనప్పుడు మొదట్లో చిత్ర దర్శక నిర్మాతలతోపాటుగా నాగార్జున కూడా ఆందోళన చెందాడు. అయితే అనూహ్యంగా 'అన్నమయ్య' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ' సినిమాకి మొదటి రోజు నుంచే మంచి స్పందన కనిపిస్తోంది. తద్వారా ఈ సినిమా రికార్డు వసూళ్ళను సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. దర్శకేంద్రుడి చిత్రం, నాగార్జున హీరోగా నటించడం, అలాగే అనుష్క ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడం ఇవన్నీ 'ఓం నమో వెంకటేశాయ' చిత్రానికి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. దానికి తోడుగా కొత్త కథాంశం 'ఓం నమో వెంకటేశాయ' పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటుగా, ఇతర రాష్ట్రాల్లోనూ 'ఓం నమో వెంకటేశాయ'కు మంచి స్పందన వస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ వసూళ్ళు అద్భుతంగా ఉన్నాయనే రిపోర్ట్స్ రావడం అభినందించదగ్గది. ఆధ్మాత్మిక అద్భుతం కావడంతో ఇతర భాషల్లోకీ డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర దర్శక నిర్మాతలు.