తెలుగు సినిమాల ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకోవడానికి పోటీ పెరుగుతోంది. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జీలతో పాటుగా ఆహా కూడా... కొత్త సినిమాల వెంట పరుగులు పెడుతోంది. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే కొత్త సినిమాల వేటలో.. ఆహా కాస్త వెనకే ఉంది. ఆహాలో ఎక్కువగా మలయాళ అనువాదాలే వస్తున్నాయని ఓ విమర్శ కూడా ఉంది. అందుకే.. ఆహాఇప్పుడు ఆ విమర్శల్ని తిప్పి కొట్టే పనిలో పడింది. రెండు చిన్న సినిమాల్ని మంచి రేటుకి కొనుగోలు చేసేసింది. అవే.. `ఒరేయ్ బుజ్జిగా`, `కలర్ ఫొటో`.
రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా` ఎప్పుడో పూర్తయిపోయింది. సినిమాని విడుదల చేద్దాం అనుకున్న సమయంలో లాక్ డౌన్ విధించారు. ఆ తరవాత... ఓటీటీ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ... నిర్మాత మాత్రం థియేటర్ రిలీజ్‌కే మొగ్గు చూపించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వడం తప్పడం లేదు. ఆహా మంచి రేటు ఆఫర్ చేయడంతో.. ఒరేయ్ బుజ్జిగా ఓటీటీకి వెళ్లిపోయింది. అక్టోబరు 2న `ఆహా`లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు. దీంతో పాటు మరో చిన్న సినిమా `కలర్ ఫొటో` నీ ఆహా దక్కించుకుంది. దీపావళికి ఈ సినిమాని ప్రదర్శిస్తారు.