కొత్త సినిమా కి ఓటీటీ వేదికలు కేరాఫ్ అడ్రస్స్‌గా మారుతున్నాయి. థియేటర్లు లేకపోవడంతో ఓటీటీనే పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నాయి. అందులో భాగంగా విడుదల అవుతున్న మరో సినిమానే `ఒరేయ్ బుజ్జిగా`. రాజ్ తరుణ్ నటించిన సినిమా ఇది. హెబ్బా పటేల్, మాళవిక నాయర్ కథానాయికలు. అక్టోబరు 2న ఆహాలో విడుదల అవుతుంది. ఈరోజు ట్రైలర్ ని విడుదల చేశారు. తెర నిండా నటీనటులు కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో కదా. `ఒరేయ్ బుజ్జిగా` అలాంటి సినిమానే.
ఇందులో బోలెడంత మంది నటులున్నారు. సినిమా అంతా.. నవ్వుతూ, నవ్విస్తూ సాగబోతోందన్న విషయం ట్రైలర్‌లోనే చెప్పేశాడు దర్శకుడు. ఎప్పటిలా అల్లరి పాత్రలో నవ్వులు పంచడానికి రాజ్ తరుణ్ సిద్ధమయ్యాడు. మాళవిక నాయర్ పాత్ర కాస్త ఇంట్రస్టింగ్ గానే ఉండేట్టు కనిపిస్తోంది. హెబ్బా అతిథి పాత్రధారిగా ఫిక్సయిందనిపిస్తోంది. సత్య, సప్తగిరిలు కామెడీ పండించేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి... తొలి సీన్ నుంచి శుభం కార్డు పడే వరకూ నవ్వులు పండించడం ఖాయంలా కనిపిస్తోంది. ఈమధ్య ఎంటర్ టైన్‌మెంట్ లేక... ప్రేక్షకులు విలవిలలాడిపోతున్నారు. వాళ్లందరికీ ఈ బుజ్జిగాడు రిలీఫ్ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?