ఈనాటి హీరోయిన్లలో మెరుపు వేగంతో స్టెప్పులేసే సత్తా సాయి పల్లవికి మాత్రమే ఉంది. వచ్చిండే కానీ, రౌడీ బేబీ గానీ చూడండి. సాయి పల్లవిలోని డాన్సింగ్ టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది. తనతో స్టెప్పులు వేయాలంటే హీరోలు కాస్త కష్టపడాల్సిందే. తన డాన్స్ కి అంత మంది ఫ్యాన్స్. తాజాగా చిరంజీవి సైతం... సాయి పల్లవి డాన్సులకు అభిమానిగా మారిపోయారు. `సాయి పల్లవితో డాన్స్ చేయాలని ఉంది` అంటూ తన మనసులోని కోరిక బయటపెట్టారు. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న రాబోతోంది.
ఈసందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలోనే... సాయి పల్లవి డాన్సింగ్ స్టైల్ ని చిరంజీవి మెచ్చుకున్నారు. ఫిదాలో చాలా బాగా డాన్స్ చేసిందని, తనతో డాన్సులు చేయాలంటే ఈతరం హీరోలు కష్టపడాల్సిందే అని కితాబిచ్చారు.
``భోళా శంకర్ లో నా సోదరి పాత్ర కోసం సాయి పల్లవిని అడిగారు. తను నో చెప్పింది. తనకి అన్నయ్యగా నటించాలని నాక్కూడా లేదు. తనతో కలిసి స్టెప్పులు వేయాలని ఉంది`` అని చమత్కరించారు చిరు. సాయి పల్లవి ఈ అవకాశాన్ని అందుకుంది. ఇదే వేదికపై చిరుతో చిన్నపాటి స్టెప్పులు వేసింది. చిరు- సాయి పల్లవి పక్క పక్కనే నిలబడి స్టెప్పులు వేయడం చూపరులను ఆకట్టుకుంది. ఈ రకంగా చిరు తన కోరికనూ తీర్చుకున్నట్టైంది. మరి వెండి తెరపై వీళ్లిద్దరూ కలిసి స్టెప్పులేస్తారేమో చూడాలి.