పలికేందుకే మహిళలు సిగ్గుపడే విషయం రుతుక్రమం అనేది. మహిళల జీవితంలో రెగ్యులర్ ప్రక్రియే అయినప్పటికీ ఈ విషయంలో గోప్యం వహించాల్సిన ఆవశ్యకత మన హిందూ సాంప్రదాయంలో పాతుకుపోయి ఉంది. అయితే ఈ కాన్సెప్ట్‌ని సినిమాగా తెరకెక్కించిన డైరెక్టర్ బాల్కీని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు.
ఈ సినిమాలో నటించినందుకు అక్షయ్ కుమార్‌ని కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ నటించిన సినిమా 'ప్యాడ్‌మాన్'. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పోజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. విడుదలైన ఒక్కరోజులోనే 10 కోట్లు వసూళ్లు సాధించిందీ సినిమా. ఈ సినిమాని సినిమాగా కాకుండా, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకునే నైతిక బాధ్యతగా తీసుకోవాలనీ, ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉందనీ సినీ విమర్శకులు చెబుతున్న మాట.
రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అతి తక్కువ ధరలకే లభ్యమయ్యే శానిటరీ ప్యాడ్స్‌ని తయారు చేసే యంత్రాన్ని కనుగొన్న ఓ వ్యక్తి జీవిత గాధే ఈ చిత్రం. అయితే ఈ చిత్రాన్ని ఇంత చక్కగా టేకప్ చేసిన దర్శకుడు, అందుకు తగ్గట్లుగా నటనా ప్రతిభను ప్రదర్శించిన హీరో అక్షయ్‌కుమార్‌కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాని ఎవరి జీవిత గాధ ఆధారంగా అయితే తెరకెక్కించారో ఆ వ్యక్తి, రియల్ 'ప్యాడ్‌మాన్' అయిన అరుణాచలం మురుగనాధం ఈ సినిమా పట్ల భావోద్వేగంతో ట్విట్టర్‌లో ఓ లేఖ ద్వారా స్పందించారు.
ఈ సినిమాలో నటించిన అక్షయ్‌కీ, దర్శకుడు బాల్కీకి స్పెషల్‌గా ధన్యవాదాలు తెలిపారు. తన కథని సినిమాగా రూపొందించే సాహసం చేసిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.