ముద్దుగుమ్మ రాశీఖన్నా ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకటి 'టచ్ చేసి చూడు'. రెండోది 'తొలిప్రేమ'. అయితే 'టచ్ చేసి చూడు' సినిమా రాశీఖన్నాకి నిరాశనే మిగిల్చింది. కానీ 'తొలిప్రేమ' మాత్రం నిలిబెట్టేసింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్ సంపాదించేసింది. దాంతో రాశీఖన్నాకి కాన్ఫిడెన్స్ పెరిగింది. అంతేకాదు ఈ సినిమాలో వర్షగా రాశీఖన్నా క్యారెక్టర్‌కి మంచి పేరొస్తోంది కూడా.
హీరోతో సమానంగా రాశీఖన్నా క్యారెక్టర్ని డిజైన్ చేశాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. అందుకు తగ్గట్లుగానే అమ్మడు కూడా మంచి నటనా ప్రతిభను చూపించిందంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. దాంతో రాశీఖన్నా ఆనందానికి అంతే లేకుండా పోయింది. మెగా కాంపౌండ్‌లో రాశీఖన్నా నటించిన రెండో సినిమా ఇది. తొలి సినిమా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో 'సుప్రీమ్'లో నటించింది. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్‌తో నటించిన 'తొలిప్రేమ' కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించడంతో ఈ ఏడాది తెలుగులో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్స్‌లో అనుష్క తర్వాతి స్థానం రాశీఖన్నాదే అని చెప్పక తప్పదు. సినిమాలో వరుణ్ తేజ్కీ, రాశీఖన్నాకి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని మాట్లాడుకుంటున్నారంతా.
గత చిత్రాలతో పోల్చితే, నటన పరంగా ఈ సినిమాకి రాశీఖన్నా చాలా పరిణితి చెందిందనీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. బరువైన, బలమైన పాత్ర ఈ సినిమా ద్వారా తనకి దక్కిందంటూ ఆనందంతో తెగ ఉబ్బి తబ్బిబ్బైపతోందీ అందాల భామ. ఇదిలా ఉండగా, తమిళంలోనూ ఈ బ్యూటీ జోరు కొనసాగిస్తోంది.