దీపికా పడుకొనే నటిస్తోన్న 'పద్మావతి' సినిమా పేరు మారి 'పద్మావత్' అయ్యింది. ఇప్పుడీ సినిమా అసలు 'పద్మావతి' కథే కాదని టాక్ వినవస్తోంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, 'చారిత్రక గాధ కానే కాదు, ఓ కవిత ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది' అని సెన్సార్ బోర్డ్‌కి, అలాగే సినిమా వివాదంపై ఏర్పాటైన పార్లమెంట్ కమిటీకి వివరణ ఇచ్చారు గతంలోనే. కానీ సినిమా నిర్మాణ సమయంలో భన్సాలీ వ్యాఖ్యలు ఇంకోలా ఉన్నాయి. అవే సినిమా వివాదానికి కారణమయ్యాయి.
సినిమాకి 26కి పైగానే కట్స్ పడ్డాయని సెన్సార్ టాక్ బయటకు రాగా, అదేమీ లేదని సెన్సార్ బోర్డ్ సభ్యులు చెప్పడమూ గందరగోళంగా ఉంది. ఏదేమైనా 'పద్మావతి' సినిమాకి జరిగినంత గందరగోళం ఇంతవరకు ఏ సినిమాకి జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాలారిష్టాలు దాటి సినిమా ఎలాగోలా ఫిబ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోందనే వార్త అయితే వచ్చిందిగానీ, అదెంత నిజమో తెలియదు. ఒకవేళ డేట్ అనౌన్స్ అయినా, మళ్ళీ వివాదాలు తలెత్తితే అంతే సంగతులు. ఇంత గందరగోళం నడుమ సినిమా నిర్మాణ సంస్థ వయాకామ్ చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది.
ఎలాంటి వివాదాలూ లేకుండా ఉండి ఉంటే 'పద్మావతి' దేశవ్యాప్తంగా విడుదలకు ముందు సంచలనాలు సృష్టించేదే. అయితే అవి పాజిటివ్ సంచలనాలై ఉండేవి. కానీ వివాదాలతో అంతకన్నా ఎక్కువగా నెగెటివ్ సంచలనం సృష్టించింది 'పద్మావతి'. పేరు మారింది, రిలీజ్ డేట్ మీద కొంత స్పష్టత వచ్చింది. చారిత్రక గాధ కాదని దర్శకుడంటున్నాడు. నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదలయితేనేగానీ చెప్పలేం.