దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'పద్మావతి'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అనుకున్నప్పటి నుండీ సినిమా చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ట్రైలర్ విడుదలయ్యాక ఆ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. షూటింగ్ దశలోనే ఆందోళన కారులు ఈ సినిమాను అడ్డుకున్నారు. అయితే ఎలాగోలా సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు విడుదల కానివ్వమంటూ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అందుకు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమా సంగతుల్ని వివరిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో రాణి పద్మావతి, అల్లా ఉద్దీన్ ఖిల్జీల మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవనీ ఆయన చెప్పారు. అంతేకాదు, రాణి పద్మావతి స్టోరీ తనకి చాలా బాగా నచ్చిందనీ, రాజ్‌పుత్‌ల పరువు, ప్రతిష్ఠలకు ఏ మాత్రం భంగం కలిగించేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉండవనీ, సినిమాని ఎంతో బాధ్యతా యుతంగా తెరకెక్కించాననీ, చరిత్రని వక్రీకరించలేదనీ ఆయన వివరణ ఇచ్చారు. కానీ రాజ్‌పుత్‌లు ఆందోళన ఆపడం లేదు. సినిమా విడుదలను అడ్డుకుంటామనీ హెచ్చరిస్తున్నారు. విడుదలకు ముందే సినిమాని రాజ్‌పుత్‌లకు చూపించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలకు వివాదాలు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడతాయి. అయితే 'పద్మావతి' విషయంలో ఏం జరుగుతుందో కానీ, వివాదం అయితే పెద్ద దుమారమే లేపుతోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కీ, పోస్టర్స్‌కీ వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో దీపికా పదుకొనె రాజసం వర్ణించడానికి మాటలు చాలడం లేదు. బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు 'పద్మావతి' సినిమా పైనే. 'బాహుబలి' సినిమా తర్వాత విడుదలవుతున్న పెద్ద చిత్రమిది. ఆ స్థాయి వసూళ్లు, విజయాన్ని సొంతం చేసుకుంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా డిశంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.