బాలకృష్ణ - పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పైసా వసూల్' సినిమా ఆడియో ఫంక్షన్‌ని తెలంగాణాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఖమ్మంలో ఈ ఫంక్షన్ జరపడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఆగష్టు 17న ఈ కార్యక్రమం జరగనుంది. హైద్రాబాద్‌కే ఒకప్పుడు పరిమితమైన ఇలాంటి సినిమా ఫంక్షన్లు ఇప్పుడు వెరైటీగా చిన్న చిన్న పట్టణాల్లోనూ జరుగుతున్నాయి. తద్వారా అక్కడి సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు సినీ జనాలు. 'పైసావసూల్' సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఇటీవలే విడుదలైన స్టంపర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరీ, బాలయ్యని ఎలా చూపిస్తాడా? అనే అనుమానం అభిమానుల్లో ఉంది అంతవరకూ. ఆ అనుమానం, స్టంపర్ చూశాక తీరిపోయింది. పూరీ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉన్నాడు బాలయ్య ఈ సినిమాలో. డైలాగులు, యాక్షన్ అన్నీ పూరీ చెప్పినట్లుగానే సరికొత్తగానే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సినిమాని విడుదల చేస్తానని పూరీ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే చెప్పాడు. అయితే అంతకన్నా చాలా ముందే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. సెప్టెంబర్ 1 వ తేదీకే 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నిజంగా అభిమానులకు పండగే. ముద్దుగుమ్మలు శ్రియ, ముస్కాన్, కైరాదత్‌లు ఈ సినిమాతో బాలయ్యతో జత కడుతున్నారు. సినిమాలో మాస్‌కి మాస్, యాక్షన్‌కి యాక్షన్, గ్లామర్‌కి గ్లామర్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి.