తెలుగు సినిమా కథెప్పుడూ కమర్షియల్ ఛట్రం చుట్టూనే తిరుగుతుంటుంది. మాస్ మసాలా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్, హారర్, థ్రిల్లర్, లవ్ స్టోరీ.. ఇలా ఏదైనా సరే, వాణిజ్య హంగులు తప్పనిసరి. కుల వ్యవస్థ, మతాల జాడ్యం.. ఇలాంటి సున్నితమైన అంశాల్ని డీల్ చేయడానికి దర్శకులు భయపడుతుంటారు. దానికి కారణం... కథా వస్తువు ఏమాతద్రం బ్యాలెన్స్ తప్పినా, మొదటికే మోసం వస్తుంది. వివాదాలకు కేంద్రం అవుతుంది. పైగా ఆర్ట్ సినిమా అనే ముద్ర పడితే... జనాలు థియేటర్లకు రావడం కూడా కష్టమే. అందుకే.... ఇలాంటి పాయింట్స్‌ని ఎవరూ ముట్టుకోవడానికి సాహసించరు.
అయితే ఈ శుక్రవారం విడుదల కాబోతున్న 'పలాస' కుల వ్యవస్థ అనే సున్నితమైన పాయింట్‌ని డీల్ చేయబోతోంది. ముఖ్యంగా బహుజనుల జీవితాల్ని, వాళ్ల వ్యధల్నీ, అగ్ర వార్ణాల చేతుల్లో వాళ్లు అణచబడుతున్న విధానాన్నీ చూపించే ప్రయత్నం చేశార్ట. రాజ్యాంగం కల్పించిన హక్కులకు సైతం బహుజనులు ఎలా దూరం అవుతున్నారో, అందుకు కారణం ఎవరో - నిజాల్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం జరిగిందట. కొన్ని వివాదాస్పద అంశాల్నీ ఇందులో టచ్ చేశారని, అవి సినిమా విడుదలయ్యేలా చర్చనీయాంశాలుగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వీటన్నింటినీ.. పలాస అనే ఊరి చుట్టూ నడపడం, అక్కడి జీవిన వైవిధ్యాన్ని హైలెట్ చెస్తూ ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడని ఈ సినిమా ఇప్పటికే చూసిన వాళ్లంతా చెబుతున్నారు. మరి పలాస విడుదలయ్యాక ఎలాంటి వైబ్రేషన్స్ తీసుకొస్తుందో చూడాలి.