కొత్త నటీనటులు రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త తరహాలో రెస్పాన్స్ అందుకుంటోంది. ఉత్తరాంధ్ర నేటివిటీని ప్రతిబింబించేలా సినిమా ఉండబోతోందని టైటిల్‌లోనే అర్ధమవుతోంది. ప్రచార చిత్రాలను బాగా డిజైన్ చేశారు. ఇక ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ ఘట్టాలు సినిమాని నెక్స్‌ట్ లెవల్‌లో ఉంచుతున్నాయి. ప్రీ రిలీజ్ టాక్ బాగా ఉండడంతో, ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ శుక్రవారం అంటే మార్చి 6న రిలీజ్ అవుతున్న చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా ‘పలాస 1978’ని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
కళ్యాణీ మాలిక్ అందించిన బాణీలు ఈ సినిమాకి మరో అస్సెట్ కానున్నాయి. అలాగే మ్యూజిక్ దర్శకుడు, గాయకుడు, నటుడు అయిన రఘు కుంచె విలనిజం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. రఘు మంచి నటుడు.. అని గతంలోనే కొన్ని చిత్రాల్లో చూశాం. బుల్లితెరపైనా ఆయన నటనా ప్రతిభకు గతంలో బోలెడంత మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రఘు కుంచెలోని నటున్ని మరో స్థాయికి తీసుకెళ్లనుందని ఆయన పాత్ర గురించి కాస్త ఎక్కువే చెప్పుకుంటున్నారు. ఏకంగా సీనియర్ నటులు రావుగోపాలరావు అంతటి గొప్ప వ్యక్తితో ఆయన్నిపోల్చుతూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది తెలియాలంటే, రిలీజ్ వరకూ ఆగాల్సి ఉంది.