భారీ బడ్జెట్ చిత్రంగా భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ సినిమాని మొదట్నుంచీ అడ్డంకులు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా అనౌన్స్ చేశారు. కానీ, పట్టాలెక్కే వరకూ నమ్మకమే లేదు. ఎలాగోలా సెట్స్ మీదికి వెళ్లింది.. అంటే, మొన్న జరిగిన యాక్సిడెంట్ చిత్ర యూనిట్‌ని తీవ్రంగా కలవరపెడుతోంది. పూర్తి స్థాయిలో ఈ యాక్సిడెంట్ చిత్ర యూనిట్ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. కమల్ హాసన్, శంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. కమల్‌హాసన్ సీనియర్ నటుడే కాదు, ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా. దాంతో కేసులో మరింత సీరియస్‌నెస్ చోటు చేసుకుంది. త్వరలోనే హీరోయిన్ కాజల్‌ని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్లో ముగ్గురి మరణానికి కారణమైన భయంకరమైన యాక్సిడెంట్ కావడంతో, ఇది ఇప్పుడప్పుడే తేలే ఆషామాషీ విషయం కాదంటున్నారు. సో ఇన్ని అడ్డంకుల మధ్య ఈ సినిమా తిరిగి షూటింగ్ జరుపుకునే అవకాశాల్లేవనిపిస్తోంది. అయినా, కమల్‌హాసన్ సినిమాకు ఇదేం కొత్త కాదు. గతంలో చాలా సినిమాలు సెట్స్ మీదికెళ్లి ఆగిపోయాయి. కొన్ని పట్టాలెక్కకుండానే ఆగిపోయాయి. ‘విశ్వరూపం 2’ తదితర చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేస్ మాత్రం అంత సులువుగా కమల్ని విడిచిపెట్టేదిలా కనిపించడం లేదు. చూడాలి మరి, ‘ఇండియన్ 2’ పరిస్థితి ఏమవుతుందో.!