దాదాపుగా ప్రతి వారం రెండు చిత్రాలు విడుదలవుతుండడం ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ట్రెండ్ గా చూడొచ్చు. అయితే ఇలా రెండు సినిమాలు పక్కపక్కనే విడుదలవుతుంటే ఒకదాని వల్ల మరొక చిత్రానికి నష్టంతో పాటుగా లాభం కూడా చేకూరినట్టవుతుంది.
ఈ వారం మాత్రం ఒక చిత్రం తాలుకా ఫ్లాప్ టాక్ మరో యావరేజ్ చిత్రానికి మేలు చేసేలా కనిపిస్తున్నది. ఇంతకి ఈ వారం విడుదలైన రెండు సినిమాలు ఏంటంటే- గోపీచంద్ హీరోగా వచ్చిన పంతం, రెండవది సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన తేజ్ ఐ లవ్ యు.
ముందుగా గోపీచంద్ సినిమా గురించి మాట్లాడుకుంటే- పంతం సినిమా తన కెరీర్ లో 25వ చిత్రం కావడం పైగా ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడం కూడా ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలన్న పంతం ఆయనలో కనపడింది. అందుకనే సినిమా టాక్ యావరేజ్ గా వచ్చినప్పటికి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు పంతం టూర్ ని కూడా మొదలుపెట్టేశాడు.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే, కమర్షియల్ ఫార్ములా చిత్రానికి లంచం అనే ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ జోడించినప్పటికి కథనంలో బలం లేకపోవడం ఈ చిత్రం సరైన విధంగా రూపుదిద్దుకునేందుకు అడ్డుపడింది అనే చెప్పాలి. దర్శకుడు ఇంకాస్త మంచిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటే ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చి ఉండేది అన్న టాక్ వినపడుతుంది. అయితే దీనితో పాటు విడుదలైన చిత్రం పూర్తిగా చేతులెత్తేయడంతో ఈ సినిమా సేఫ్ జోన్ కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.
ఈ వారం విడుదలైన రెండవ చిత్రం తేజ్ ఐ లవ్ యు. మెగా సుప్రీమ్ హీరో అయిన సాయి ధరం తేజ్ కి వరుసగా 5 ఫ్లాపులు వచ్చేసరికి ఈ చిత్రంతో కచ్చితంగా మళ్ళీ హిట్ బాట పడతాడు అన్న నమ్మకం అందరికి ఈ చిత్రం విడుదలకి ముందు ఉంది.
దీనికి ప్రధాన కారణం కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే అదే సమయంలో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అనుపమ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాకి ప్రధాన లోపం కథ అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. డార్లింగ్ సినిమా ఎందుకంటే ప్రేమంట చిత్రాల లైన్ లో ఈ చిత్ర కథ ఉండడం అలాగే కథ కూడా ప్రేక్షకులు నమ్మే విధంగా లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టకోలేకపోయింది.
దీనితో ఈ సినిమా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ రావడం మొదలవగా అది మొదటిరోజు కలెక్షన్స్ పైన తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో గోపీచంద్ పంతం వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారట.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్...