బయోపిక్‌లు తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట. అలాంటి.. వర్మపైనే ఓ బయోపిక్ వస్తోంది. `పరాన్నజీవి` పేరుతో. ఆదివారం ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు రాత్రి... వర్మపై తొలి పాటనీ విడుదల చేస్తున్నారు. వర్మపై బయోపిక్ అంటే అందరికీ ఆసక్తే. మరి ఈ బయోపిక్ తీస్తుందెవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? అనే విషయాలు టాలీవుడ్ లో ఆసక్తి కరమైన చర్చకు దారి తీస్తున్నాయి.
వర్మ `పవర్ స్టార్` అనే సినిమా తీస్తున్నాడు. ఇది పవన్ కథే అని అందరికీ తెలుసు. పవన్‌ని ఈ సినిమాలో వర్మ సెటైరికల్ గా చూపించబోతున్నాడు. అందుకే ఇప్పుడు పవన్ అభిమానులంతా కలిసి వర్మపై ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ. పవన్‌తో నూతన్ నాయుడుకి సన్నిహిత సంబంధాలున్నాయి. పవన్ అభిమానులంతా ఓ వర్గంగా ఏర్పడి, పెట్టుబడి పెట్టారు. వాళ్ల టార్గెట్.. వర్మనే. అందుకే ఇప్పుడు వాళ్లంతా ఈ సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. మొన్నామధ్య జొన్నవిత్తుల కూడా వర్మపై ఓ సినిమా తీస్తానని బయల్దేరారు. కానీ.. అది ఇప్పటి వరకూ మొదలవ్వలేదు. మరి ఈ సినిమా పరిస్థితేంటో?