సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఇప్పుడు లాక్‌డౌన్ ముంచుకొచ్చిందాయె.! ఇటు మహేష్‌తో సినిమా చేయాలి.. ఇంకోపక్క నాగచైతన్యతో సినిమాకి కమిట్ అయ్యి వున్నాడాయె.! ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్ పరిస్థితి ఇది. పెద్ద హిట్ కొట్టాక కూడా తదుపరి సినిమా కోసం చాలా సమయమే ఎదురు చూడాల్సి వచ్చింది పరశురావ్‌ుకి. బహుశా ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఏ దర్శకుడూ ఎదుర్కోలేదేమో.! ఎట్టకేలకు నాగచైతన్యతో సినిమా ఓకే అయ్యిందనుకుంటే.. ఇంతలోనే మహేష్ నుంచి పిలుపు వచ్చింది. వీటికి తోడు కరోనా ముంచుకొచ్చింది.
ప్రస్తుతం తన కథలకి మెరుగులు దిద్దే పనిలో బిజీగా వున్నాడీ దర్శకుడు. రెండు సినిమాలే కాదు, మరో సినిమాకి కూడా కథ సిద్ధం చేశాడట పరశురామ్. ముందుగా మహేష్‌తో సినిమా వుంటుందనీ, ఆ తర్వాత నాగచైతన్యతో సినిమా చేస్తాననీ.. ఈ రెండూ పూర్తయ్యాకే లేడీ ఓరియెంటెడ్ కథాంశం దుమ్ము దులుపుతాననీ చెప్పుకొచ్చాడు పరశురామ్. మూడో సినిమా సంగతి తర్వాత.. ముందైతే మహేష్ సినిమా పట్టాలెక్కాలి. అది మే నెలాఖరుకి లాంఛనంగా జరగొచ్చనే ప్రచారం సినీ పరిశ్రమలో తెరపైకొచ్చింది.
మహేష్‌తో సినిమా చేస్తూ నాగచైతన్యతో సినిమా చేయడం జరిగే పని కాదు. మహేష్ ఈ మధ్య చాలా వేగంగా సినిమాలు చేస్తున్న దరిమిలా, ఆ వేగం పరశురామ్ విషయంలోనూ జరిగితే, అది ఈ దర్శకుడికి చాలా సులువవుతుంది. అన్నట్టు, నాగచైతన్యతో సినిమా కథ చాలా ప్రత్యేకమైనదని పరశురామ్ చెబుతున్నాడు.