తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశాడాయన. అయితేనేం, తెలుగు సినీ పరిశ్రమ ఆయన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంది. బాలీవుడ్ నటుడే అయినా, తన మరణం తర్వాత.. అందరినీ కంటతడి పెట్టించాడు. ఆయనే ఇర్ఫాన్ ఖాన్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమలే కాదు.. హాలీవుడ్ కూడా ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు మరి. అయితే మాత్రం, బాలీవుడ్ నటుడు గనుక.. హాలీవుడ్ ఎందుకు పట్టించుకోవాలి.? ఇలాంటి లెక్కలేమీ వేసుకోలేదు సినీ ప్రముఖులు.. ఇర్ఫాన్ ఖాన్ ‘తమ కుటుంబ సభ్యుడు’ అని భావించారంతా.
సోషల్ మీడియాలో ట్వీటేయడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు.. అని కాదు.! ఇర్ఫాన్ ఖాన్ వ్యక్తిత్వానికి అంతా ఫిదా అయిపోయారు. కింది స్థాయి నుంచి సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు ఇర్ఫాన్ ఖాన్. అందుకే, సినీ ప్రపంచం ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిశాక కూడా నటనకు గుడ్ బై చెప్పలేదు. వైద్య చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటించాడు. క్యాన్సర్‌పై పోరాటం చేసి, తిరిగి తన కెరీర్‌ని కొనసాగించాలనుకున్నాడుగానీ.. క్యాన్సర్ మహమ్మారి ఆయన్ని చంపేసింది. అరుదైన క్యాన్సర్ కావడంతో, క్యాన్సర్‌పై ఎంత వీరోచితంగా ఇర్ఫాన్ ఖాన్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లాక్‌డౌన్ కారణంగా అత్యంత సన్నిహితులు మాత్రమే ముంబైలో ఆయన పార్టీవదేహానికి నివాళులర్పించారు. కానీ, సోషల్ మీడియా వేదికగా.. ఆయన పేరు మార్మోగిపోతూనే వుంది. ఓ మహానటుడికి ఇంతకంటే గౌరవం ఇంకేముంటుంది.?