త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా కాదు 'అజ్ఞాతవాసి'. తెలుగు సినీ పరిశ్రమలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'అజ్ఞాతవాసి' వస్తుందనీ, పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇలాంటి సినిమా వస్తుందనీ ఎవరూ ఊహించలేదు. ఏ సినిమా సక్సెస్‌ని అయినా ముందే అంచనా వేయలేం. కానీ త్రివిక్రమ్ - పవన్ కాంబోలో సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా ఎబౌ యావరేజ్, హిట్ అనే టాక్ వస్తుందనే అందరూ నమ్మారు. కానీ ఆ అంచనాలు బోల్తా కొట్టాయి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ వస్తుందనుకుంటే, భారీ డిజాస్టర్ వచ్చి చేరింది.
ఏ మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, ఎట్‌లీస్ట్ డివైడ్ టాక్ వచ్చి ఉన్నా మినిమమ్ 120 కోట్ల సినిమా అయి ఉండేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అసలు వారికే ఇంతటి డిజాస్టర్ త్రివిక్రమ్ - పవన్ నుంచి ఎలా వచ్చిందో అర్థం కాకపోవడం గమనించదగ్గ అంశం. పవన్ ఇప్పుడైనా మేలుకోవాలి. అలాగే త్రివిక్రమ్ కూడా. తెరపై తానేం చేసినా చెల్లిపోతుందనీ, తెర వెనుకాల సినిమాని అస్సలు పట్టించుకోకపోయినా పని నడిచిపోతుందని పవన్ అనుకుంటే అది పొరపాటేనని తేలిపోయింది. అలాగే త్రివిక్రమ్ కూడా. ఓవర్సీస్‌లో చాలా దెబ్బతిన్నాడు. డైరెక్టర్‌గా ఆయనకి తగిలిన చాలా పెద్ద దెబ్బ అది.
ఒక్క సినిమాతో త్రివిక్రమ్ ఇమేజ్, శ్రీనువైట్లలా పడిపోయింది. శ్రీనువైట్ల సినిమాలకి ఒకప్పుడు ఓవర్సీస్‌లో, ఇండియాలో మినిమమ్ గ్యారంటీ అన్న నమ్మకం ఉండేది. 'ఆగడు' సినిమాతో శ్రీనువైట్ల పనైపోయింది. 'అజ్ఞాతవాసి'తో త్రివిక్రమ్ పనైపోయిందనుకోవాలా?