సినీ విమర్శకులు, దర్శకుడు, వైకాపా పార్టీ సానుభూతి పరుడు... కత్తి మహేష్ అంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఏమాత్రం పడదు. ఎందుకంటే.. పవన్ పై చాలాసార్లు కత్తి మహేష్ విరుచుకు పడ్డాడు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంలో రచ్చ చేశాడు. అప్పటి నుంచీ కత్తి మహేష్‌ని టార్గెట్ చేశారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు అదే కత్తి మహేష్ ఎకౌంట్ కి డబ్బులు కూడా వేస్తున్నారు. వ్యవహారం విచిత్రంగా ఉంది కదూ.
విషయంలోకి వెళ్తే... పవన్‌కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పవన్ ఫ్యాన్స్ వాళ్లని `పేటీఎం బ్యాచ్`గానే పరిగణిస్తున్నారు. వాళ్లు సోషల్ మీడియాలో చేసే ప్రతీ వ్యాఖ్యకు 5 రూపాయలు వైకాపా నుంచి అందుతాయని ఓ రూమర్ ఉంది. అలా కత్తి మహేష్ చేసే ప్రతీ ట్వీట్ కీ, ప్రతి వ్యాఖ్యకీ డబ్బులు అందుతాయని పవన్ అభిమానుల నమ్మకం. అందుకే.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా రివర్స్‌లో కత్తి మహేష్ ఎకౌంట్ నెంబర్ కి డబ్బులు పంపడం మొదలెట్టారు. డబ్బులంటే వేలూ, లక్షలూ అనుకుంటారు. రూపాయి, రెండు రూపాయలు. ఒకాయన రూపాయి పావలా పంపాడట. `ఇలా రూపాయి. అర్థ రూపాయి పంపి.. మీ హీరో పరువు తీయకండి..` అంటూ.. కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే పనిలో పడ్డాడు.
`ఒకొక్కరూ రూపాయి పంపినా.. మీకు కోట్లు వస్తాయి కదా` అని ఎవరో నెటిజన్ కామెంట్ చేస్తే... `పవన్ అభిమానులు కోట్లలో ఉంటారని నేను అనుకోను` అంటూ.. వాళ్లని కెలికే ప్రయత్నం చేశాడు. రూపాయో, రెండు రూపాయలో.. ఇప్పుడైతే కత్తి మహేష్ ఎకౌంట్లో మాత్రం డబ్బులు పడుతున్నాయి. అవన్నీ పోగేస్తే ఎంత అవుతాయో, ఏంటో?