థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చినా, నిర్మాతలు మాత్రం ధైర్యం చేయడం లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాని విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో తొలి పోస్టర్ పడింది. `సోలో బతుకే సో బెటర్` సినిమాని క్రిస్మస్‌కి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈ సినిమా థియేటర్ లోనూ, ఓటీటీలోనూ ఒకేరోజు విడుదల అవుతుంది. జీ 5 సంస్థ ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కుల్ని కొనుగోలు చేసింది. థియేటరికల్ రిలీజ్ బాధ్యత కూడా వాళ్లదే.
ఓటీటీలు చాలామందికి అందుబాటులో లేవు. పైగా.. బీసీ సెంటర్ ప్రేక్షకులకు ఓటీటీ ఇప్పటికీ కొత్తే. అందుకే వాళ్ల కోసమైనా థియేటరికల్ రిలీజ్ ఉండాలన్నది ప్లాన్. ఓటీటీ లో చూసే అవకాశం ఉన్నవాళ్లు... ఓటీటీలో చూస్తారు. థియేటర్ అనుభవం కావాలంటే.. థియేటర్లకు వస్తారు. ఇదీ ప్లాన్. ఎలాగూ.. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాని విడుదల చేయాలి. థియేటరికల్ రిలీజ్ ద్వారా ఎంతొచ్చినా.. అదనపు ఆదాయమే కదా. అందుకే... ఈ వ్యూహాన్ని ఓటీటీ సంస్థలు అమలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇక నుంచి.. ఓటీటీ కి అమ్ముడుపోయిన సినిమాలన్నీ ఇదే పద్ధతిలో విడుదలయ్యే అవకాశం ఉంది.