ఉప్పెనతో... సంచలన ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఏకంగా రూ. 50 కోట్ల వసూలు చేసింది. ఓ డెబ్యూ హీరోకి ఇంత మొత్తంలో వసూళ్లు రావడం నిజంగా ఓ రికార్డ్! ఇప్పుడు అందరి దృష్టీ `కొండపొలెం`పైనే. వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ఇది. క్రిష్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈనెల 8న కొండపొలెం విడుదల అవుతోంది.
ఈ సినిమా కోసం భారీగా ప్రచారం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా పవన్ కల్యాణ్‌ని రంగంలో దింపితే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ అంటే పవన్ కి చాలా ఇష్టం. వైష్ణవ్‌కి నటనలో ఉన్న ఆసక్తిని గ్రహించి, తను శిక్షణ తీసుకోవడానికి పవన్ తన వంతుగా సాయం చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఉప్పెన సమయంలోనూ తన ఇన్‌పుట్స్ అందించారు. వైష్ణవ్ రెండో సినిమాకీ తన వంతు సాయం చేసే అవకాశం ఉంది. పవన్ ముందుకొచ్చి... ప్రచారంలో భాగం పంచుకుంటే ఈ సినిమాకి మరింత మైలేజీ వస్తుంది. పైగా క్రిష్ తో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. తన కోసమైనా సరే... పవన్ ఈ సినిమా కోసం ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. హైదరాబాద్ లో కొండపొలెం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ కి పవన్ రావొచ్చు అన్నది సంకేతం.
అయితే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ వచ్చాడు. అప్పుడు జరిగిన రచ్చ తెలిసిందే. పవన్ స్పీచ్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రచారం కాస్త.. పవన్ స్పీచులో కొట్టుకుపోయింది. ఆ తరవాత జరిగిన రాద్ధాంతం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా వేడుకకు వచ్చి, పవన్ పొలిటికల్ స్పీచ్ దంచి కొడితే - అస్సలు బాగోదు. అలాగని పవన్ వచ్చి పొలిటికల్ గా పంచ్‌లు వేయకపోతే, పవన్ వెనక్కి తగ్గాడన్న సంకేతాలు వస్తాయి. సో.. పవన్ కొండపొలం కోసం రావకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.