`గబ్బర్ సింగ్`... ఈ సినిమాని ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు. హీరోగా పవన్ స్టామినా ఏమిటో చూపించిన సినిమా ఇది. పోలీస్ కథల్లో ఓ ట్రెండ్ సెట్టర్. పరాయి కథల్ని తెలుగీకరించుకోవడం ఎలా..? అనే విషయాన్ని భలేగా చెప్పిన స్క్రిప్టు. ఇక అంత్యాక్షరి అయితే హైలెట్. గబ్బర్ సింగ్ తరవాత ఈ టైపు కాన్సెప్టులు ఎన్ని వచ్చాయో..? హరీష్ శంకర్ లోని మాస్ యాంగిల్‌ని నూటికి నూరుపాళ్లూ ఆవిష్కరించిన సినిమా ఇది. ఇప్పుడు పవన్ - హరీష్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. దాంతో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలైపోయాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ తరహా మాస్ ఎంటర్‌టైనర్‌ని కోరుకుంటున్నారు అభిమానులు.
హరీష్ కూడా మరో గబ్బర్ సింగ్ ని ఇవ్వబోతున్నానని అభిమానులకు మాట కూడా ఇచ్చేస్తున్నాడు. సందేశాలూ, ఊక దంపుడు ఉపన్యాసాలూ.. హరీష్ శంకర్ కి అస్సలు పడవు. సినిమాల ద్వారా సందేశాలిస్తే జనాలు మారే రకాలు కారని హరీష్‌కీ తెలుసు. అందుకే ఈసారి కూడా పవన్ కోసం ఓ మాస్ మసాలా కథనే ఎంచుకున్నాడట. ఇది పక్కా కమర్షియల్ సినిమా అనీ, ఫ్యాన్సంతా కాలర్ ఎత్తుకునేలా ఈ సినిమా ఉండబోతోందని పవన్ కల్యాణ్ అభిమానులకు హింట్ ఇస్తున్నాడు హరీష్. అన్నట్టు ఈ రోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు. ఈ మాస్ దర్శకుడి నుంచి మరో గబ్బర్ సింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.