జనసేన నాయకుడు.. పవన్ కల్యాణ్ త్వరలోనే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? మీడియా ఛానళ్ల హడావుడి చూస్తూంటే అదే అనిపిస్తోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఈ దఫా.. మిత్రపార్టీ అయిన జనసేనకూ ప్రాతినిథ్యం ఇవ్వాలని నరేంద్రమోడీ భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో.. బలపడడానికి బీజేపీ పలువిధాల ప్రయత్నిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని, కొన్నయినా సీట్లు పొందాలని పాచికలు వేస్తోంది. అందుకే... ఇప్పటి నుంచే జనసేనని మచ్చిక చేసుకోవాలన్నది ప్లాన్. అందులో భాగంగానే పవన్‌కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే పవన్ ఈ ఆఫర్ ని స్వీకరిస్తారా, లేదా? అన్నది కీలకంగా మారింది. తాను `నో` అన్నా.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కైనా ఆ ఆఫర్ అందిచడం ఖాయమన్నది మరో వర్గం చెబుతున్నమాట.
అయితే... రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పుకార్లని కొట్టి పరేస్తున్నారు. ఏపీలో జనసేనకు వచ్చిన సీట్లు ఒకటి మాత్రమే. ఆ ఒక్క సీటు కూడా ఉన్నా లేనట్టే. అలాంటప్పుడు జనసేనకు అంత ప్రాధాన్యం ఇచ్చి, మంత్రి పదవి ఆఫర్ చేస్తారా? అన్నది ప్రధానమైన ప్రశ్న. తిరుపతి ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు తెలిపింది. అయినా సరే.. బీజేపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం తిరుపతి సీటైనా గెలిపిస్తే... పవన్ కి కానుకగా మంత్రి పదవి ఇవ్వొచ్చు. తిరుపతిలో ఓటమి తరవాత కూడా.. పవన్‌కి మంత్రి పదవి ఇచ్చారంటే అది గ్రేటే. మరి ఇది కేవలం పుకార్లేనా? నిజంగా పవన్ పేరు.. లిస్టులో ఉందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.