వేసవి సెలవలు ముగింపు దశకు వచ్చాయి. అందుకే సినిమాలు కూడా వరుసగా హోరెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌ని వాడుకోవాలన్న తాపత్రయంతో నిర్మాతలు తమ సినిమాల్ని రంగంలోకి దింపుతున్నారు. అందుకే ప్రతీవారం కొత్త సినిమాలతో థియేటర్లు తళతళలాడుతున్నాయి. ఈవారం రంజాన్ సెలవు కూడా అదనంగా దొరకడంతో - సినిమాల జోరు మరింత ఎక్కువైంది. హిప్పీ, సెవెన్‌లతో పాటు కిల్లర్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా ఈ వారంలోనే విడుదలయ్యాయి. ఆర్.ఎక్స్ 100తో యూత్ హీరోలలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆ సినిమాతో చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ కథని ఆచి తూచి ఎంచుకున్నానని, అదే హిప్పీ అని గొప్పగా చెప్పాడు. కార్తికేయ గెటప్పు, హీరోయిన్ల అందాలు, జేడీ చక్రవర్తి డైలాగులూ వెరసి హిప్పీపై ఆసక్తిని పెంచాయి.
అయితే ఆ అంచనాలన్నీ తలకిందులు చేసేసింది హిప్పీ. కథ, కథనం, పాత్రల తీరుతెన్నులు ఇవన్నీ టోటల్ గా విసిగించేయడంతో తొలి రోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుని, ఇప్పుడు డిజాస్టర్ దిశగా మళ్లుతోంది. ఆర్.ఎక్స్ 100 తో వచ్చిన ఊపు చూసి ఈ సినిమాని అధిక ధరలకు కొనుక్కున్న బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. థిల్లర్ చిత్రంగా జనం ముందుకొచ్చిన సెవెన్ కూడా దారుణంగా విసిగించింది. థ్రిల్లర్ చిత్రానికి ఉండాల్సిన లక్షణం. స్క్రీన్ ప్లే వేగం. కానీ... ఈ సినిమా కథనం మాత్రం నత్తనడక నడిచింది. దర్శకుడిలో విషయం ఉన్నా కథలో పట్టులేకపోవడంతో ఈ సినిమా దారి తప్పింది. పబ్లిసిటీ భారీగా చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ప్రారంభ వసూళ్లు కూడా అంతంత మాత్రమే.
ఇక విజయ్ ఆంటోనీ మాత్రం కాస్త ఉపశమనం ఇచ్చినట్టే అనుకోవాలి. విజయ్ ఆంటోనీ ఇప్పుడు వరుస ఫ్లాపులలో ఉన్నాడు. `బిచ్చగాడు` తరవాత సరైన సినిమా పడలేదు. ఇప్పుడు ఆ లోటుని `కిల్లర్` తీర్చింది. కథ రొటీనే అయినా, ఆసక్తికరమైన కథనం, మలుపులతో ఈ సినిమాని చాలా పకడ్బందీగా నడిపాడు. పబ్లిసిటీ సరిగా చేయలేకపోవడంతో మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకి దిక్కయ్యింది. అంతో ఇంతో వసూళ్లు వస్తున్నాయంటే అది ఈ సినిమాకే అని చెప్పుకోవాలి. ప్రతీ ఈద్‌కీ ఓ సినిమాని విడుదల చేసే సల్మాన్ భాయ్.. ఈ సారి `భారత్`ని విడుదల చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌ల జాబితాలో చేరిపోయింది. సల్మాన్ వీరాభిమానులు కూడా `ఇదేం సినిమారా బాబూ` అని తలలు పట్టుకుంటున్నారు. సల్మాన్ కథల విషయంలో మరింత శ్రద్దగా ఉండాలని, మితిమీరిన ప్రయోగాల జోలికి పోకూడదని ఈ సినిమా నిరూపించింది.