పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా మరికొద్ది రోజుల్లోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సారాంశం ఏంటంటే, 'ఉన్న ఊరిని వదిలి ఇంకో ఊరులో ఉద్యోగం చేస్తూ, అక్కడ సెటిలవడమే చాలా కష్టం. అలాంటిది, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి అక్కడ ఉద్యోగాలు చేస్తూ, ఫ్యామిలీ రిలేషన్స్‌కి దూరంగా ఉంటూ, అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకోవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి వారి కష్టాన్ని నేను అర్ధం చేసుకోగలను. అలాంటిది అక్కడ మీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఇక్కడ నుండి మీ తరపున మాట్లాడేందుకు కొన్ని కోట్ల గొంతులు సిద్ధంగా ఉంటాయనీ పవన్ కళ్యాణ్ అన్నారు'. అంటే విదేశాల్లో స్ధిరపడిన ఎన్నారైలను ఉద్దేశించి పవన్ ఈ మాట అన్నారు.
విదేశాల్లో పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా రికార్డు స్థాయిలో అత్యధిక ధియేటర్స్‌లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. 'గతంలో నేను నటించిన 'బద్రి' సినిమా తొలిసారిగా ఓవర్సీస్‌లో చాలా తక్కువ ధియేటర్స్‌లో విడుదలైంది. అలాంటిది ఇప్పుడు.. అక్కడ అత్యథిక థియేటర్స్‌లో నా సినిమా 'అజ్ఞాతవాసి' విడుదలవుతోందంటే, అందుకు కారణం మీరే. మీరు చూపించిన ఆప్యాయత, అభిమానమే కారణం. అందుకు నేను కృతజ్ఞుణ్ణి..' అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయినట్లే. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ పవన్‌తో జోడీ కడుతున్నారు ఈ సినిమాలో. యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.