పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే నిర్మాతలు ముందే సేఫ్ అయిపోతారు. ఎందుకంటే.. తనకున్న క్రేజ్ అలాంటిది. గత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు బిజినెస్ అయిపోతుంది. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చాలు. గళ్లా పెట్టెలు నిండిపోతాయి. అందుకే నిర్మాతలంతగా పవన్ తో సినిమా చేయడానికి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ నిర్మాతలే పవన్ తో సినిమా అంటే `ఎందుకులే` అని సైడ్ అయిపోతున్నారు. కారణం... సినిమాలకు పవన్ తన డేట్లు కేటాయించలేకపోవడమే.
పవన్ ఇప్పుడు హరి హర వీరమల్లు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. రెండు రోజులు షూటింగ్ చేస్తే.. పది రోజులు గ్యాప్. ఎప్పుడు షూటింగ్ ఉంటుందో, ఎప్పుడు ఉండదో చెప్పలేని పరిస్థితి. అసలు నిర్మాత ఏ.ఎం.రత్నం.. అప్పుల్లో ఉన్నారు. ఈసినిమాపై ఇప్పటికే ఆయన భారీ ఎత్తున ఫైనాన్స్ తీసుకొచ్చారు. ఆ వడ్డీల భారం రోజురోజుకీ పెరుగుతోంది. మరోవైపు.. పవన్‌కి ఈ సినిమా షూటింగ్ అంటే అనాసక్తి ఏర్పడిందని టాక్. హరి హర వీరమల్లు అంటే.. పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని, ఒప్పుకొన్నా కాబట్టి తప్పదన్నట్టు.. నెలకు మూడు, నాలుగు రోజుల కాల్షీట్లు ఇస్తున్నాడని, పవన్ కాస్త మేలుకుని, ఈ సినిమాని త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప.. హరి హర వీరమల్లు గట్టెక్కదని టాక్. ఈ విషయం పవన్‌తో ఎలా చెప్పాలో తెలీక పవన్ దర్శక నిర్మాతలు కక్కలేక, మింగలేక బాధ పడుతున్నార్ట. మరి పవన్‌కి ఈ సినిమా పూర్తి చేయాలని ఎప్పుడు అనిపిస్తుందో, ఏంటో?