పవన్ కల్యాణ్ - రామ్ చరణ్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. `వీడి నా తమ్ముడు.. ` అంటూ `రంగస్థలం` వేడుకలో... చరణ్ గురించి పవన్ చెప్పిన మాటలు ఇప్పటికీ అభిమానులకు గుర్తే. చరణ్ కూడా బాబాయ్‌పై తన ప్రేమని చూపించాడు. తన బ్యానర్లో పవన్ తో ఓ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. పవన్‌కి తగిన కథ కోసం అన్వేషిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో వార్త మెగా అభిమానుల్ని ఆనందంలోనూ, ఆశ్చర్యంలోనూ ముంచెత్తుతోంది. అదేంటంటే.. త్వరలోనే పవన్, చరణ్ ఒకే సినిమాలో కనిపించబోతున్నార్ట.
క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రంలో చరణ్ అతిథిగా కనిపిస్తాడని టాక్. చరణ్ పాత్ర 5 నిమిషాల పాటు ఉంటుందని, ఆయా సన్నివేశాలు మాంచి కిక్ ఇస్తాయని సమాచారం అందుతోంది. ఈ విషయమై ఇప్పటికే క్రిష్ చరణ్‌ని సంప్రదించారని, చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగే.