ఇటు సినిమాలు, అటు పార్టీ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఓరకంగా.. పవన్‌కి ఇది మైనస్. పవన్‌ని పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌గా వెక్కిరించడానికి ప్రత్యర్థులకు ఇదో ఆయుధంగా మారింది. పవన్ రాజకీయాల్లో సీరియస్‌నెస్ లేదని ఎద్దేవా చేయడానికి ఈ పాయింట్ బాగా ఉపయోగపడుతోంది. సినిమాల హడావుడిలో పార్టీ కార్యకలాపాల్ని పట్టించుకోవడానికి పవన్‌కి పెద్దగా టైమ్ ఉండడం లేదు కూడా. సినిమాలు వదిలేసి, ఆ సమయాన్నీ పార్టీకే కేటాయిస్తే.. వచ్చే ఎన్నికల్లో పవన్‌కి మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కానీ పవన్ పరిస్థితి వేరు. తన పార్టీకి అన్నీ తానే. పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. డబ్బుతో కూడిన పని. ఆ డబ్బంతా తన జేబులోంచే తీయాలి. పవన్‌కి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ లేరు. ఏ వ్యాపార వేత్త.. పవన్ వెనుక లేడు. పైగా పవన్ మనసు వేరు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. కౌలు రైతుల విషయమే చూడండి. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయని పని పవన్ చేశాడు. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకొంటూ పోయాడు. పైగా... జనసైనికులకు ఇన్సురెన్సులు కడుతున్నాడు. ఇన్సురెన్సు అంటే నెల నెల... డబ్బులు కుమ్మరించడమే. లక్షలమందికి బీమా కట్టడం సామాన్యమైన విషయం కాదు. నెలకు కోట్లు ఖర్చవుతాయి. పవన్ ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కించాడు. ఆ సినిమా కోసం తీసుకొన్న అడ్వాన్స్ పార్టీ ఇన్సురెన్సు ఖర్చుల నిమిత్తం డొనేట్ చేశాడు. పవన్ సినిమాలు చేస్తోంది కూడా.. డబ్బులు కూడబెట్టడానికి కాదు. ఆ ఆదాయాన్ని పార్టీకి బదలాయించడానికే. పవన్ తలచుకొంటే యేడాదికి రూ.200 కోట్లు సంపాదించగలడు. ఆ సొమ్మంతా మళ్లీ పార్టీకే ధారబోయాల్సిన పరిస్థితి. అలా.. పవన్ చేస్తున్న సినిమాలు కూడా, రాజకీయంగా తననీ, తన పార్టీని బలోపేతం చేయడానికే వాడుకొంటున్నాడు.