అమెరికాలో జరుగుతున్న తానా సభలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఆయన్ని ఎలా ఉంటే ఇష్టపడతారో, అలాగే జీన్స్, ఆ పైన సూటు ధరించి హ్యాండ్‌సమ్ లుక్స్‌తో 'తానా' సభలకు హాజరయ్యారు. తానా వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, చురుక్కులు చమక్కులు అక్కడి ప్రవాసాంధ్రుల్లో ఉత్సాహం నింపాయి.
కులాలు, మతాలు లేని, విలువలతో కూడిన రాజకీయాల్ని తీసుకొద్దామనుకున్నా. కానీ, జరగలేదు. ఓటమి ఎదురైంది. కానీ ఈ ఓటమి నన్ను కుంగదీయలేదు. మరింత ఉత్సాహాన్ని, బలాన్ని నింపింది.. అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చెప్పారు. అంతేకాదు, జైలుకెళ్లి వచ్చిన వాళ్లే దర్జాగా, హాయిగా జనంలో తిరుగుతుంటే, జనం కోసం పోరాడాలనే కసితో, కోట్ల సంపాదనను వదులుకుని సత్య మార్గంలో నడవడానికి వచ్చిన నేనెందుకు భయపడాలి? భయపడను. రెట్టించిన ధైర్యంతో ముందడుగు వేస్తాను.. కులాలు, మతాలు నాకు తెలియవు.
వాటితో సంబంధం లేకుండా, కులమతాలకతీతమైన రాజకీయాల కోసం పోరాడతా.. మనుషులందరినీ కలిపే రాజకీయాల్ని తీసుకొస్తా.. అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్థావించారు. అంతేకాదు, మరిన్ని సూచనలు, సలహాలు తీసుకోవడానికి మీ వద్దకు మళ్లీ వస్తా అంటూ.. పవన్ ప్రవాసాంధ్రుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.