పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, అంటే దానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఆయన ఇప్పడు ఒకప్పటి పవర్ స్టార్ కాదు.. మారిన పవర్ స్టార్. అందుకే, స్పీడ్ బాగా పెరిగింది. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసేసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూట్‌కి హాజరవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత మేర జరిగిన విషయం విదితమే.
వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసెయ్యాలన్న ఆలోచనతో అటు దర్శక నిర్మాతలు, ఇటు హీరో వున్నట్లు తెలుస్తోంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో సినిమాకి హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. మరోపక్క, పవన్ - రానా కాంబినేషన్‌లో సినిమా కూడా శరవేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారట. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుందని సమాచారం. ఇంత వేగంగానా.? పవన్ కళ్యాణ్ ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడమా.? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
నిజంగానే ఇది పవన్ అభిమానులకు స్వీట్ షాక్ లాంటిది. ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు.. వెరసి పవన్ ఇంత బిజీగా వుండడం ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నది అభిమానుల వాదనగా కనిపిస్తోంది. వేగం సరే, ఆయా సినిమాలు థియేటర్లలోకి వచ్చేదెప్పుడు.? ఇది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.