ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా అభిమానులు సంయమనం పాఠించాలని పవన్ కళ్యాణ్ స్వయంగా అభిమానుల్ని కలిసి వారిని వారించారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు చాలా పద్ధతిగా, కుట్రగా ముందుకెళ్తున్నారు. అందుకే వారిని తెలివిగా ఎదుర్కోవాలి తప్ప ఆవేశం పనికిరాదు. భవిష్యత్తులో ఏ ఒక్కరూ ఇలాంటి తప్పు చేయడానికి భయపడేలా చేద్దాం అని అభిమానులకు సూచించారు పవన్ కళ్యాణ్. 'అభిమానులు పవన్ మాటల్ని శిరసా వహిస్తూ, మీరు చెప్పినట్లే చేస్తాం ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడమన్నా..' అంటూ హామీ ఇచ్చారు.
మరో పక్క ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులపై ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తునే ఉన్నారు. ట్వీట్లతో వారికి చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ ఈ ఇష్యూలో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి శ్రీరెడ్డి తిట్టిన వీడియో బైట్‌ని పోస్ట్ చేసి, మీ మీ ఇళ్లల్లోని ఆడవారికి చూపించమని పవన్ సలహా ఇచ్చారు. అయితే ఉద్దేశం ఏదైనా సరే పవన్ కళ్యాణ్..మళ్లీ ఈ వీడియోని రీపోస్ట్ చేయడం మాత్రం తప్పన్పిస్తోంది. అభిమానులే ఈ వీడియోని పదే పదే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.
అమ్మ ఎవరికైనా అమ్మే. అలాంటి అమ్మని తిడితే, ఆ కొడుకుతో పాటు, అందరికీ బాధనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సినీ రంగంలోని పెద్దలందరూ భేటీ అయ్యారు. కాస్టింగ్ కౌచ్, ఆర్టిస్టులకు జరుగుతున్న ఇతరత్రా అన్యాయాలకు పరిష్కారాల దృష్ట్యా వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.