ఇప్పుడు అందరి దృష్టీ పవన్ వైపే. నిన్న మొన్నటి దాకా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలంటూ బహిరంగంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. 'జనసేన' పార్టీ అధినేతగా ఇన్‌స్పైరింగ్ ప్రసంగాలెన్నో చేస్తున్నారు. దాంతో రాజకీయాల్లో పవన్ ప్రకంపనలు మొదలయ్యాయి.
పార్టీలకతీతం, కులాకకతీతం అంటూ తన పార్టీ అజెండాతో జనాలకు దగ్గరవుతున్నారు. దాంతో వార్తల్లో ఎక్కడ విన్నా పవన్ గురించే టాపిక్ నడుస్తోంది. కాగా ఈ మధ్యనే 'అజ్ఞాతవాసి' సినిమాని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. మరో పక్క పవన్ రాజకీయాల్లో ఈ రకంగా బిజీ అయితే సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారా అనే విషయంపై కూడా పోజిటివ్ సంకేతాలు వస్తున్నాయి.
2019 ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలు ఇలా రెండింటినీ మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రాజకీయాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ఏదో ఒక నియోజక వర్గానికి ఎమ్యెల్యేగానో, ఎంపీగానో ఉంటే..బాలకృష్ణలాగా ఫర్వాలేదు. ఇటు రాజకీయాలను, అటు సినిమాలనూ ఏకకాలంలో మేనేజ్ చేయవచ్చు. కానీ ఇలా సొంత పార్టీ నేతగా రెండింటినీ బ్యాలెన్స్ చేయడమంటే ఒకింత కష్టమైన పనే. ఈ కారణంగానే అన్నయ్య చిరంజీవి సినిమాలకు దూరమయ్యారు.
అయితే ఎలక్షన్స్ వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తాడేమోనని ఆయన సన్నిహితుల నుండి అందిన సమాచారమ్. చూడాలి మరి పవన్ ఏం చేస్తాడో!