తెలుగునాట అతి పెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికి 4 సీజన్లు వచ్చాయి. నాలుగూ సూపర్ హిట్టే. 5 వ సీజన్ కూడా ఇప్పటికే మొదలైపోవాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల... ఆలస్యమైంది. అయితే... జులైలో బిగ్ బాస్ 5 మొదలవ్వడం ఖాయమని టాక్. ఇప్పటికే... సెలబ్రెటీల లిస్టు తయారైపోయిందని, వాళ్లతో బిగ్ బాస్ టీమ్.. సంప్రదింపులు కూడా మొదలెట్టిందని సమాచారం అందుతోంది. గత సీజన్లో పెద్దగా సెలబ్రెటీలెవరూ కనిపించలేదు.
ఉన్నవాళ్లతో సర్దుకుపోయారు. దాంతో.. ప్రేక్షకుల నుంచి కాస్త అసంతృప్తి మొదలైంది. అందుకే ఈసారి ఆ విషయంలో బిగ్ బాస్ టీమ్ జాగ్రత్త తీసుకుందట. ఈసారి లిస్టులో పేరున్న సెలబ్రెటీలు కనిపించే ఛాన్స్ ఉంది. ఆ జాబితాలో పాయల్ రాజ్ పుత్ కూడా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఎక్స్ 100తో మంచి ఫేమ్ సంపాదించుకుంది పాయల్. వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకుడితోనూ జోడీ కట్టింది. అయితే.. ఆ తరవాత తన కెరీర్ బాగా డల్ అయ్యింది.
ఈసారి ఎలాగైనా ఫేమ్ లోకి రావాలని చూస్తున్న పాయల్ కి బిగ్ బాస్ మంచి అవకాశం అందిస్తోంది. బిగ్ బాస్ టీమ్ పాయల్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే.. పాయల్ అందుకు ఒప్పుకుందా, లేదా? అనేది తెలియాల్సివుంది. పాయల్ గనుక ఓకే అంటే ఈసారి సీజన్ లో.. గ్లామర్ మోత మోగిపోవడం ఖాయం.