ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాన్ని మాటల రూపం లో ఒక చోట పేర్చి వాటికి స్వరాలూ సమకూరిస్తే ఆ బంధం ఒక పాటగా రూపాంతరం చెందుతుంది.
ఇప్పుడోస్తున్న పాటల్లో కేవలం ధ్వని కాలుష్యం తప్ప భావ సంపద ఉండటంలేదు అని విమర్శిస్తున్న వారికి అరవింద సమేతలో “పెనివిటి” పాట ఒక చిన్నపాటి సమాధానం అని అనిపిస్తుంది. ఇక ఈ పాటలో
ఇంటి నుండి బయటకి వెళ్ళే భర్త తిరిగి ప్రాణాలతో వస్తాడా? లేక విగతజీవిగా వస్తాడా అన్న భయంలో నుండి...
తన భర్త కళ్ళ ముందే తిరుగుతున్నా తనని కళ్ళలో పెట్టుకుని చూసుకోలేకపోతున్నాడు అని...
వంటింటిలో ఉన్న తన వైపుకి చూడకుండా వరండాలోనే ఉండిపోతున్న తన భర్త పై చిన్నపాటి కోపాన్ని...
కొడవలి పై చూపే ప్రేమని తన పైన కూడా కాసింత చూపమని ప్రాధేయపడుతూ...
తమకి పుట్టిన నలుసు కోసమైనా తమవైపుకి తన భర్త దృష్టి తిప్పమని..
తన భర్త వేళకి తింటున్నాడా లేదా అని ఆరాటపడే హృదయంతో...
ఇలా తన భర్త కోసం తన గుండెకి గొంతుక ఇస్తూ తన పెనివిటి పై తన కోపాన్ని, బాధని ఏకకాలంలో వ్యక్తపరిచే ఓ ఇంటి యజమానురాలి భావాలకి ఊపిరి పోస్తూ రాసిన రామజోగయ్య శాస్త్రి గారి భావసృష్టికి ఎవరైనా దాసోహం కాక తప్పదు..
ఇంత మంచి పాట ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెబుతూనే మీకు మరిన్ని సార్లు ధన్యవాదాలు చెప్పే అవకాశం మరిన్ని సార్లు మీ పాటల రూపంలో మాకు కల్పించాలని ఆశిస్తున్నాము.
రామజోగయ్య శాస్త్రి గారి పాటకి - జీవం పోసిన తమన్ గారికి... గొంతుక ఇచ్చిన కాల భైరవకి... రాయించుకున్న త్రివిక్రమ్... చిత్రంలో పదిలంగా పెట్టుకున్న నిర్మాతకి... పాటలోని భావాన్ని మనకి చూపించేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ లకి ప్రత్యేక అభినందనలు...