పదహారేళ్ల తరవాత... ఓ సినిమాని కొత్త టెక్నాలజీ జోడించి రిలీజ్ చేయడం, దానికి అపూర్వ స్పందన రావడం.. పోకిరితో సాధ్యమైంది. మంగళవారం మహేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా `పోరికి` సినిమాని 4 K టెక్నాలజీ, డాల్బీ డీటీఎస్ జోడించి మళ్లీ విడుదలచేశారు. దాదాపు 250 థియేటర్లలో పోకిరిని ప్రదర్శిస్తే.. అన్ని థియేటర్లూ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. నిజంగా కొత్త సినిమా విడుదలైతే ఫ్యాన్స్ ఎంత హడావుడి చేస్తారో, ఈ రీరిలీజ్‌కీ అంతే హంగామా చేశారు. చాలా చోట్ల టికెట్లు దొరక్క వెనక్కి వెళ్లిపోయిన ఫ్యాన్స్ ఉన్నారు.
మహేష్ ఎంట్రీ సీన్‌కీ, డైలాగులకూ, పాటలకూ, క్లైమాక్స్ ట్విస్టుకీ.. అదేదో కొత్త సినిమా చూస్తున్నట్టు థియేటర్లో విజుల్సూ, వన్స్ మోర్లూ వినిపించాయి.
ఓ పాత సినిమాకి ఇంత హడావుడి ఎక్కడా చూడలేదని మహేష్ నాన్ ఫ్యాన్స్ కూడా... ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం విశేషం. కొన్ని చోట్ల `ఒక్కడు` సినిమాని ఇలానే.. ప్రదర్శించారు. ఈ షోల ద్వారా వచ్చే ఆదాయం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. త్వరలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ పాత సినిమాల్ని కూడా ఇలానే 4 K టెక్నాలజీ, డాల్బీ డీటీఎస్ జోడించి విడుదల చేయాలని భావిస్తున్నారు. `జల్సా`ని దాదాపు 300 థియేటర్లలో రీ రిలీజ్ చేయాలని ప్లాన్. పవన్ సినిమా.. అందులోనూ జల్సా అంటే చెప్పేదేముంది? ఫ్యాన్స్‌కి పండగే. ఇక ముందు ఇలానే పాత సినిమాల్ని రీ రిలీజ్ చేయడం.. ఓ ట్రెండ్ గా మారుతుందేమో చూడాలి.