ప్రముఖ నటుడు, నిర్మాత, తెలుగు దేశం పార్టీ నేత మురళీ మోహన్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ స్టేషన్‌లో అనుమానితంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు కోట్ల నగదుని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఇద్దరూ మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగస్తులని తేలింది. రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి మురళీమోహన్ కోడలు రూప తెలుగుదేశం పార్టీ తరపునుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రూపకు అందజేయడానికి ఈ రెండు కోట్లు తీసుకుని వెళ్తున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఈ డబ్బుని మురళీ మోహన్‌కి ఇవ్వడానికే తీసుకెళ్తున్నామని నిందుతులు కూడా అంగీకరించారు. దాంతో.. మురళీ మోహన్‌పై ఐపీసీ 171 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.