30 ఇయర్స్ ఫృథ్వీ ఎప్పుడో వైకాపా తీర్థం పుచ్చేసుకున్నాడు. అప్పటి నుంచీ.. మిగిలిన పార్టీలపై, నాయకులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే.. ఫృథ్వీ రాజకీయాల్లోకి రాక ముందు పవన్ గురించీ, పవన్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పేవాడు. పవన్ నిజాయతీని శ్లాఘించేవాడు. అందుకే పవన్ ని విమర్శించే విషయంలో మాత్రం ఫృథ్వీ ఆచి తూచి స్పందించేవాడు.
ఇప్పుడు ఎన్నికల వాతావరణం జోరందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో పవన్‌ని విమర్శించడం తప్పడం లేదు. అందుకే ఫృథ్వీ కూడా పవన్‌ని టార్గెట్ చేస్తూ... సెటైర్లు వేయడం మొదలెట్టాడు. పవన్ ఎప్పుడూ తాట తీస్తా.. తొక్క తీస్తా అంటున్నాడని, - రాజకీయం అంటే కొబ్బరి కాయల వ్యాపారం కాదని సెటైర్లు వేశాడు.
2019లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు వెన్నుపోటు గురించి మాట్లాడిన వ్యక్తికి 2014లో మాత్రం చంద్రబాబులో ఆదర్శవంతమైన నేత కనిపించాడని, ఈ ఎన్నికలలో ఇద్దరూ కుమ్మక్తై జగన్‌ని ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫృథ్వీ సెటైర్లు బాగానే పేలుతున్నాయి. అయితే.. ఫృథ్వీ కూడా ఆ తానులో ముక్కేకదా? మొన్నటి వరకూ పవన్ నిజాయతీ పరుడని చెప్పిన ఫృథ్వీ.. ఇప్పుడు ఎన్నికల కోసం మరో పార్టీతో కుమ్మక్కయ్యాడని చెప్పడం ఎంత వరకూ సబబు. ఫృథ్వీదీ రెండు నాలుకల ధోరణే కదా.. అని పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.