ఒకప్పుడు దక్షిణాదిలో గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భానుప్రియ .. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. చెన్నైలో నివాసం ఉంటున్న భానుప్రియపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కేసు నమోదయింది. ఏడాది కాలంగా తన కుమార్తెని నిర్బంధించి హింసిస్తున్నారని సామర్లకోట మండలానికి చెందిన ప్రభావతి పోలీస్టేషనులో కేసు నమోదు చేసింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి సలహా మేరకు తన 14 ఏళ్ళ కూతురు సంధ్యని భానుప్రియ ఇంటిలో పనికి పంపానని, మొదట్లో బాగానే ఫోన్లో మాట్లాడించేవారనీ, అప్పుడప్పుడు ఇంటికి పంపేవారని చెప్పింది. కానీ, గత కొన్ని రోజులుగా సంధ్యతో ఫోన్ కూడా మాట్లాడించక పోవడంతో ప్రభావతి కుటుంబం ఆందోళన చెందింది. దాంతో, తన కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నారని, భానుప్రియ సోదరుడు సంధ్యపై తరచుగా లైంగిక దాడులకు పాల్పడుతుంటాడని, తన కూతురిని ఇంటికి పంపమని ప్రాధేయపడినా అంగీకరించటం లేదని ఫిర్యాదు చేసింది.
మొదట చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళని కూడా సంప్రదించారట. ప్రస్తుతం, సామర్లకోట పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వార్త వెలికి రావడంతో చిత్ర పరిశ్రమ షాక్ కి గురి అయ్యింది. త్వరలో నటి భానుప్రియతో విచారణ జరపనున్నట్లు సమాచారం.