హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా రన్ అవుతున్న ఓ మినీ కాసినోని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 25మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గరనుంచి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఫామ్ హౌస్ నాగశౌర్య తండ్రి ప్రసాద్... ఐదేళ్ల కోసం లీజుకి తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయన్ని విచారణకు రమ్మంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఫామ్ హోస్ ప్రసాద్ పేరుమీద లీజుకు తీసుకున్నా, వాటి నిర్వహణ బాధ్యత మొత్తం గుత్తా సుమన్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పేకాట దందా కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతోందని సమాచారం. ప్రసాద్ దగ్గర్నుంచి... గుత్తా సుమన్ ఈ ఫామ్ హౌస్‌ని అద్దెకు తీసుకున్నారా? అసలు గుత్తా సుమన్‌కీ నాగశౌర్య కుటుంబానికి లింకేంటి? అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఫామ్ హౌస్ ఓ ఐఏఎస్ అధికారిది. నాగశౌర్య తన ఆఫీసు పనుల నిమిత్తమే.. ఈఫామ్ ని ఆయన్నుంచి లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా కార్యక్రమాల కోసం కాకుండా.. ఇలా పేకాట కోసం ఈ ఫామ్ హౌస్ ని వాడుతున్నారన్న విషయం సదరు ఐఏఎస్ ఆఫీసరుకి కూడా తెలీదట. ఈ ఆరు నెలలో నాగశౌర్య కేవలం రెండు మూడు సార్లు ఈ ఫామ్ హౌస్ కి వచ్చినట్టు తెలుస్తోంది. నాగశౌర్య తండ్రి ప్రసాద్ పేరుమీద లీజు పేపర్లు ఉన్నాయి కాబట్టి. ముందు ఆయన్నివిచారించనున్నారు. ఆ తరవాతే.. అసలు నిజాలు బయటపడతాయి.