ఎట్టకేలకు మణిరత్నం.... పొన్నియన్ సెల్వన్ విడుదలైంది. మణి కలల సినిమా ఇది. ఈ సినిమా రిజల్ట్ మణికి చాలా అవసరం. ఎందుకంటే ఈమధ్య ఆయన ఆరోగ్యం సరిగా లేదు. హార్ట్ ఎటాక్ తో ఓసారి ఆసుపత్రి పాలయ్యారు మణి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు, కుటుంబ సభ్యులూ కోరుకొన్నారు. కానీ పొన్నియన్ సెల్వన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే రిస్క్ చేసి మరీ ఈ సినిమా తీశారు. అందుకే ఏ సినిమా విడుదల ముందూ లేనంత టెన్షన్.... ఈ సినిమాకి అనుభవిస్తున్నారు మణిరత్నం. తమిళంలో ఈ సినిమాకి అడ్వాన్సు బుకింగ్స్ బాగున్నాయి. తెలుగులోకి వచ్చేసరికి మాత్రం ఆ హడావుడి కనిపించలేదు. ఈ రోజు ఈ సినిమాని ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల రిపోర్ట్.
పొన్నియన్ సెల్వన్ అనే పేరు ఎవరికీ రిజిస్టర్ కాలేదు. పీఎస్ 1 అనుకొన్నా.. అదేం ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ అంత ఎఫెక్టీవ్ గా లేదు. ఛోళ సామ్రాజ్యం... వాళ్ల చరిత్ర గురించి తమిళ వాసులు కనెక్ట్ అయినంతగా తెలుగు వారు కాదు. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ సినిమాని బాహుబలి తో పోల్చి చూసుకొంటున్నారు. బాహుబలి పోలిక ఎప్పుడైతే వచ్చిందో.. అప్పుడు ఏ సినిమా కంటికి ఆనదు. పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ లో భారీదనం కనిపించినా.... బాహుబలి పక్కన తేలిపోవడం ఖాయం. అందులోనూ మణిరత్నం ఫామ్ లో లేడు. సినిమా బాగుంటే - అప్పుడు జనం వెళ్తారేమో గానీ, ఇప్పటికైతే జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదన్నది వాస్తవం. అందుకే ఓపెనింగ్ డే చాలా డల్ గా మొదలైంది. దిల్ రాజు తెలుగులో ఈ సినిమాని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి భారీగా ప్రచారం కల్పించాలి. లేదంటే... రాబోయే రెండు మూడు రోజులూ ఇదే పరిస్థితి కనిపించొచ్చు.